Saturday, January 30, 2010

యోగసుఖ నిధులైనవారికి



యోగసుఖ నిధులైనవారికి
ప.యోగసుఖ నిధులైనవారికి 
మార్గమంతయు పూలబాట
గమ్యమంతయు గోచరంబగు
గుహ్యమైన విద్యవలన
1.గురుడు చూపిన మార్గముననే
గురుతు తెలియును సాధకునకు
గతులు తప్పక గమనమందిన
ఇంద్రధనుసే జనితమగును
అందుగల జలమంతరించును
దివ్య తేజము గోచరించును
చిత్తమంతయు శాంతమందును
చేతనము చిగురించుచుండును

2.అంతరాంతరములయందలి
విశ్వమును వీక్షించుచుండును
విశ్వమందలి వింతవింతలు
సంతసము చేకూర్చుచుండును
సతతమానందమును పొందుచు
సత్యమందే సంచరించును
మోహమంతయు మాయమగును 
మోక్షమునకై నడక సాగును

3. అంతరమునకు బాహ్యమునకు 
అంతరమ్మే తెలియకుండును
అంతయునుసమమగుచునుండును 
అందరిని సమదృష్టిచూచును
వాక్కు అనునది శుద్ధమగును
వచించునది సత్యమగును
నిర్గుణత్వమునిలచియుండును ఆత్మదర్శనమగుచునుండును


రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం-smkodav@gmail.com

VUDAYINCHE SURYUNI







ఉదయించే సూర్యుని 

ప.ఉదయించే సూర్యుని అదే పనిగా చూడకు
ఉదయించని సూర్యుని హృదయమందు గాంచుమా 
1.భ్రమణమందు భూమియే సూర్యోదయమెచట గలదు
భ్రమలోపడి బ్రతుకంతా భయపడుతూ బ్రతుకకు
బ్రహ్మమె నీలోనున్నది దర్శించుము ధైర్యమ్ముగ
బ్రహ్మము నీవే నిజముగ నిలకడగా తెలియును
2. కలవంటిదె మెలకువయని వక్కాణించిరి విజ్ఞులు
మెలకువనే సాధించిన మరు జన్మయె లేదుకదా
వెలకట్టగ లేనివెన్నొ వెలువడెనుధధి మధింప
తెలివిగ నీలో నిఖిల జగమునే దర్శించుము
3. బ్రహ్మపదార్ధమ్మది బాహ్యమందు బయలుపడదు
బ్రహ్మము ప్రత్యక్షమ్మగు అంతర్మధనమువలన
బ్రహ్మమే దర్శనము అంతర్యానమున పర
బ్రహ్మమే నీవగుదువు అచంచల దీక్ష యున్న


రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం   -   smkodav@gmail.com

నీటి లోన నావ







నీటి లోన నావ నిలకడగ నుండు

ప. నీటి లోన నావ నిలకడగ నుండు
నీరుచేరిన నావ మునుగుచునుండు
సంసార జలధిలో సత్పురుషుడుండు
నీటిలో నావవలె నిలకడగ నుండు 
1. నిలకడగలవాడు నిర్గుణుండు
ఎఱుకగలవాడు ఈశ్వరుండు
నిజము యెల్లపుడు నిష్ఠురముగానుండు
సత్యమార్గమ్మెపుడు సహజముగనుండు
2. నిప్పు యెల్లపుడు నివురుగప్పియుండు
ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు
ఉత్తముండెల్లపుడు ఊహకందక యుండు
చిద్విలాసుండెపుడు చింతలే లేకుండు
3. నీలోన నాలోన నిజముగానుండు
పరమును చేర్చెడి పరమాత్ముడుండు
అంతరానందమును చవిచూపుచుండు
అంతటను నిండి ఆటలాడుచు నుండు

రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం   -    smkodav@gmail.com

Followers

About Me

My photo
Visakhapatnam, Andhrapradesh, India
Suggestions may be sent to smkodav@gmail.com