పెద్ద నిధి యున్నను పేరెంత యున్నను |
ప. పెద్ద నిధి యున్నను పేరెంతయున్నను
పెద్ద నిద్దుర నెవరు తప్పించగలరు
అ.ప.ముద్దుముచ్చటలన్ని మృత్యువునుచేరు
వద్దన్నవదలనివి చావు పుట్టుకలు
1. పుట్టిన ప్రతి జీవి గిట్టుట తధ్యము
కట్టెయై మిగులును కాలమే తీరును
చుట్టాలు పక్కాలు చుట్టు ప్రక్కలవారు
పట్టుకొని పోవుదురు పాడె కట్టుకుని
2. తాత ముత్తాతలు రాజులు రౌతులు
కాల గర్భములోన కన్ను మరుగైరి
నీవును నేనును ఏనాటికైనను
కైలాస భూమిలో కాలవలసినదే
3. పెద్ద నిద్దుర లేని పరమాత్మ చేరెడి
నిద్దురయె తెలివియగు నిజమొకటి కలదు
సద్దు సేయక మనసు సంధ్యనే తిలకింప
అద్భుతంబగు జ్యోతి అంతరమ్మున వెలయు
4. జీవన్ముక్తుడై యుండగలిగెడి యుక్తి
జీవించి యుండగనె పొందగలిగెడి శక్తి
జీవి యందెల్లపుడు జీవించి యుండు
జీవ భావము వీడ దైవత్వమబ్బు
రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం
smkodav@gmail.com
No comments:
Post a Comment