Sunday, April 18, 2010

MAYA KAAYAMMIDI JEEVAA

-->















మాయ కాయమ్మిది జీవా
ప. మాయ కాయమ్మిది జీవా దీని
మాయలో పడి చెడకు జీవ
1. ఆసలెన్నొ పడుచు నుందువు
శ్వాస వున్న వరకె చెల్లును
శ్వాస వీడిన ఆస వీడును
వీసమైన వెంట రాదుగా
2.కట్టె కట్టెల కాలునప్పుడు
మట్టిలోనను కలియునప్పుడు
కట్టు కొన్నవి కానరావుగా
కట్టెపైనను మోజు దండగ
3.దేహమందుండును దేహియే
దేహము కాదు నువు దేహివి
దేహ భ్రాంతిని మదిని వీడిన
దేహియే దైవమై వెలయును
4.మోహమనునది నాశమందుట
మోహక్షయమందుటెమోక్షము
దేహధారియే దైవము సం
దేహములేదిదియె సత్యము

రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం
smkodav@gmail.com
===================================
ఏది శాశ్వతం..గతించేదే..యిదీ అంతే
(రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం..02.04.2010)
       ఇంద్రప్రస్థ సామ్రాజ్యాన్ని ఇంద్రసేనుడనే రాజు పాలించేవాడు. ప్రజలందరినీ యెంతో ఆదరాభిమానాలతో చూసేవాడు.  యెన్నో ప్రజారంజకమైన, అందరకు యెంతో వుపయోగ పడే పనులెన్నో చేపట్టి వారి మన్ననలనందుకొనిన మహారాజు ఆయన.
         ఒకరోజు ఆమహరాజుకు ఒక ఆలోచన వచ్చింది. ప్రపంచంలో యెన్నన్నో రకరకాల ప్రశ్నలు వున్నాయి. వాటికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమాధానం యిస్తారు. సరియైనది అవునో కాదో తెలియదు. ఇదే యదార్ధము అనేది కొన్ని సందర్భాలలో చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి అన్నీ ప్రశ్నలకు ఒకటే సమాధానం వుంటే యెంత బాగుంటుంది అని ఆలోచించించేడు. మరునాడు నిండు సభలో తన తపన అందరితో పంచుకొన్నాడు. కానీ అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం యెలాగునని అందరూ సందిగ్ధంలో పడ్డారు. మహారాజు మాత్రం సమాధానం ఒక్కటే వుండాలని పట్టుపట్టేడు. ఒక వారం రోజులు షరతు పెట్టేడు కూడా. సభలోని వారందరూ తలలుపట్టుకొని యిది యేలాగున సాధ్యమని దిక్కు తోచక బిక్క చచ్చి పరిష్కారం కోసం పరి పరి విధాలుగా ఆలోచించ నారంభించేరు.
           పండితులు అందరూ కూడా వారి వారి యిళ్లకు వెళ్ళి దీర్ఘాలోచంలో పడ్డారు. గడువు రానే వచ్చింది. సభ అంతా కూడా  పండిత పామరులతో, సామంతరాజులతో, మంత్రులు, వగైరా జనసందోహంతో కిటకిటలాడుతోంది. మహారాజు వున్నతాసనంపై కూర్చోన్నాడు. అంతా నిశ్శబ్ధ వాతావరణం.
       మహారాజు ముఖారవిందాన్ని చూసినవాళ్లందరకు యే క్షణంలో యేమి జరుగుతుందోనని ఆతృతగా వుంది. పండిత జనానికి పచ్చి వెలక్కాయ పడివుంది నోట్లో. మహరాజు మరచిపోయేడేమో అనుకునే తరుణంలో గొంతులోంచి కంచుగంట మ్రోగింది. ఏమయింది నా ప్రశ్న? జవాబు దొరికిందా? అంతా నిశ్శబ్ధం. ఎవ్వరూ మాటలాడడానికి సాహసించలేకపోయేరు. ఆసమయంలో ఒక వృద్ధ పండితుడు లేచి నిలబడి మహారాజా నేను బాగా ఆలోచించగా, ఆలోచించగా దొరికిన జవాబు అది యేమిటంటే, అది యేమిటంటే:
 ఏది శాశ్వతం .. గతించేదే .. యిదీ అంతే ”
అని ప్రతి దానికి రాజీ పదడమే అన్నాడు. రాజా దర్బారు అంతా నిశ్చేస్టులై మహారాజువంక చూస్తూ వుండిపోయేరు. మహారాజు కొంతసేపు మౌనం. తరువాత దీర్ఘాలోచన. అప్పుడు మహారాజు ముఖంలో మహదానందం. కరతాళ ధ్వనులు. సభ అంతా కరతాళ ధ్వనులతో కళకళలాడింది. ఆ వృద్ధ పండితుని బహు విధాల సత్కరిస్తూ మహారాజు యిలా అన్నాడు:
“ఈ పండితుని ఆలోచన పటిమ యెంతో ప్రశంసనీయం. చెప్పినది అక్షర సత్యం. నేను  రాజుగా వుండే వాణ్ణి. శత్రువులు జయించి నన్ను అడవులకు తరిమేశారు. మళ్ళీ నేను కొన్నాళ్లకు సేనలను కూడగట్టుకొని మీ అందరి ఆదరాభిమానాలతో ఈ సువిశాల సామ్రాజ్యానికి మహారాజునాయ్యెను. ఇది కూడా శాశ్వతం కాదుకదా. అంతా గతించేదే. ఆశాశ్వతమే కదా. తాత ముత్తాతలు రాజులు రౌతులు కాల గర్భములోన కన్నూమరుగయ్యేరు. మనం అందరం కూడా అంటే ప్రతివాడు వున్నన్నాళ్ళు అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను జయించి అంటే వాటికి దాసుడు కాకుండా తమ  చెప్పు చేతలలో వుంచుకొని జీవితమంతా సుఖశాంతులతో వుండాలని మహారాజు సభలోనివారందరికి యెంతో సంతోషంతో చెప్పేడు. అందరూ నిండైన ఆనందంతో సభ ముగిసిన తరువాత వారివారి యిళ్లకు వెళ్ళేరు. ఆ వృద్ధ పండితుడు కూడా చాలా సంతోషించేడు. 
వివరణ: డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి   {సినారె} ఇలాగన్నారు. 
అప్పుడప్పుడు దుఃఖమన్నది అ౦టుకోనీ మనసును
ఎప్పుడూ సుఖమైతే మనిషి భరి౦చగలడా బతుకు మ౦చును
స్థిర౦ కాదని తెలిసినా తెగ మరులు కలిగిస్తు౦ది దేహ౦
కాస్త జారితే పగిలిపోయే కడవపై ఎ౦తె౦త మోహ౦
అష్టావకృడంటాడు కదా:
 “సాకారమనృతం విధ్ధి నిరాకారం తు నిశ్చలం
ఏతత్ తత్వోపదేశేన న పునర్భవ సంభవః” అని
“యదృశ్యం తన్నశ్యం” అని కూడా నానుడి.
కనుపించేది అంతా నశించేదే. ఈ చర్మ చక్షువులకు కనపడనిది జ్ఞాన నేత్రానికి మాత్రమే దర్శనమయ్యే అద్భుతమైన నిధి ఆ పరమాత్మ సన్నిధి.  పరతత్వాన్ని దర్శించి అందరూ జన్మ రాహిత్యమును పొంది మృత్యుంజయులయ్యేదరు గాక. ఆ పరమాత్మ ఒక్కటే సర్వ కాల సర్వ అవస్థల యందు మార్పు లేకుండా శాశ్వతంగా వుండే సత్ చిత్ ఆనందం.

Saturday, January 30, 2010

యోగసుఖ నిధులైనవారికి



యోగసుఖ నిధులైనవారికి
ప.యోగసుఖ నిధులైనవారికి 
మార్గమంతయు పూలబాట
గమ్యమంతయు గోచరంబగు
గుహ్యమైన విద్యవలన
1.గురుడు చూపిన మార్గముననే
గురుతు తెలియును సాధకునకు
గతులు తప్పక గమనమందిన
ఇంద్రధనుసే జనితమగును
అందుగల జలమంతరించును
దివ్య తేజము గోచరించును
చిత్తమంతయు శాంతమందును
చేతనము చిగురించుచుండును

2.అంతరాంతరములయందలి
విశ్వమును వీక్షించుచుండును
విశ్వమందలి వింతవింతలు
సంతసము చేకూర్చుచుండును
సతతమానందమును పొందుచు
సత్యమందే సంచరించును
మోహమంతయు మాయమగును 
మోక్షమునకై నడక సాగును

3. అంతరమునకు బాహ్యమునకు 
అంతరమ్మే తెలియకుండును
అంతయునుసమమగుచునుండును 
అందరిని సమదృష్టిచూచును
వాక్కు అనునది శుద్ధమగును
వచించునది సత్యమగును
నిర్గుణత్వమునిలచియుండును ఆత్మదర్శనమగుచునుండును


రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం-smkodav@gmail.com

VUDAYINCHE SURYUNI







ఉదయించే సూర్యుని 

ప.ఉదయించే సూర్యుని అదే పనిగా చూడకు
ఉదయించని సూర్యుని హృదయమందు గాంచుమా 
1.భ్రమణమందు భూమియే సూర్యోదయమెచట గలదు
భ్రమలోపడి బ్రతుకంతా భయపడుతూ బ్రతుకకు
బ్రహ్మమె నీలోనున్నది దర్శించుము ధైర్యమ్ముగ
బ్రహ్మము నీవే నిజముగ నిలకడగా తెలియును
2. కలవంటిదె మెలకువయని వక్కాణించిరి విజ్ఞులు
మెలకువనే సాధించిన మరు జన్మయె లేదుకదా
వెలకట్టగ లేనివెన్నొ వెలువడెనుధధి మధింప
తెలివిగ నీలో నిఖిల జగమునే దర్శించుము
3. బ్రహ్మపదార్ధమ్మది బాహ్యమందు బయలుపడదు
బ్రహ్మము ప్రత్యక్షమ్మగు అంతర్మధనమువలన
బ్రహ్మమే దర్శనము అంతర్యానమున పర
బ్రహ్మమే నీవగుదువు అచంచల దీక్ష యున్న


రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం   -   smkodav@gmail.com

నీటి లోన నావ







నీటి లోన నావ నిలకడగ నుండు

ప. నీటి లోన నావ నిలకడగ నుండు
నీరుచేరిన నావ మునుగుచునుండు
సంసార జలధిలో సత్పురుషుడుండు
నీటిలో నావవలె నిలకడగ నుండు 
1. నిలకడగలవాడు నిర్గుణుండు
ఎఱుకగలవాడు ఈశ్వరుండు
నిజము యెల్లపుడు నిష్ఠురముగానుండు
సత్యమార్గమ్మెపుడు సహజముగనుండు
2. నిప్పు యెల్లపుడు నివురుగప్పియుండు
ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు
ఉత్తముండెల్లపుడు ఊహకందక యుండు
చిద్విలాసుండెపుడు చింతలే లేకుండు
3. నీలోన నాలోన నిజముగానుండు
పరమును చేర్చెడి పరమాత్ముడుండు
అంతరానందమును చవిచూపుచుండు
అంతటను నిండి ఆటలాడుచు నుండు

రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం   -    smkodav@gmail.com

Sunday, December 20, 2009

గాలి బుడగ ఈ జీవితము


గాలి బుడగ ఈ జీవితము
పల్లవి....   గాలి బుడగ ఈ జీవితము
            గమ్మత్తుగ చేరు మృత్యువును

అ. ప....  గమ్యమునెరిగిన గుణవంతుండు
           
మృత్యుంజయుడై మనుట తధ్యము

   1.   
విత్తమునందాసక్తిని వీడి
         
చిత్తము చిదంబరమ్మందుంచిన
         
దేహ భ్రెంతియే దూరమ్మగును
         
దివ్యమైన దర్శనమ్మగును

    2.   దేహియె తానని దేహము కాదని
         
దేహిని మృత్యువు చేరగలేదని
         
దేహియె సర్వము నిండియుండునను
         
సత్యమునెరిగి మృత్యుంజయుడగు


                           రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం  
                     


                 smkodav@gmail.com

http://www.scribd.com/doc/66015041/Guru-Dev                                 



Followers

About Me

My photo
Visakhapatnam, Andhrapradesh, India
Suggestions may be sent to smkodav@gmail.com