ప. మాయ కాయమ్మిది జీవా దీని
మాయలో పడి చెడకు జీవ
1. ఆసలెన్నొ పడుచు నుందువు
శ్వాస వున్న వరకె చెల్లును
శ్వాస వీడిన ఆస వీడును
వీసమైన వెంట రాదుగా
2.కట్టె కట్టెల కాలునప్పుడు
మట్టిలోనను కలియునప్పుడు
కట్టు కొన్నవి కానరావుగా
కట్టెపైనను మోజు దండగ
3.దేహమందుండును దేహియే
దేహము కాదు నువు దేహివి
దేహ భ్రాంతిని మదిని వీడిన
దేహియే దైవమై వెలయును
4.మోహమనునది నాశమందుట
మోహక్షయమందుటెమోక్షము
దేహధారియే దైవము సం
దేహములేదిదియె సత్యము
రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం
smkodav@gmail.com
===================================
ఏది శాశ్వతం..గతించేదే..యిదీ అంతే
(రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం..02.04.2010)
ఇంద్రప్రస్థ సామ్రాజ్యాన్ని ఇంద్రసేనుడనే రాజు పాలించేవాడు. ప్రజలందరినీ యెంతో ఆదరాభిమానాలతో చూసేవాడు. యెన్నో ప్రజారంజకమైన, అందరకు యెంతో వుపయోగ పడే పనులెన్నో చేపట్టి వారి మన్ననలనందుకొనిన మహారాజు ఆయన.
ఒకరోజు ఆమహరాజుకు ఒక ఆలోచన వచ్చింది. ప్రపంచంలో యెన్నన్నో రకరకాల ప్రశ్నలు వున్నాయి. వాటికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమాధానం యిస్తారు. సరియైనది అవునో కాదో తెలియదు. ఇదే యదార్ధము అనేది కొన్ని సందర్భాలలో చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి అన్నీ ప్రశ్నలకు ఒకటే సమాధానం వుంటే యెంత బాగుంటుంది అని ఆలోచించించేడు. మరునాడు నిండు సభలో తన తపన అందరితో పంచుకొన్నాడు. కానీ అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం యెలాగునని అందరూ సందిగ్ధంలో పడ్డారు. మహారాజు మాత్రం సమాధానం ఒక్కటే వుండాలని పట్టుపట్టేడు. ఒక వారం రోజులు షరతు పెట్టేడు కూడా. సభలోని వారందరూ తలలుపట్టుకొని యిది యేలాగున సాధ్యమని దిక్కు తోచక బిక్క చచ్చి పరిష్కారం కోసం పరి పరి విధాలుగా ఆలోచించ నారంభించేరు.
పండితులు అందరూ కూడా వారి వారి యిళ్లకు వెళ్ళి దీర్ఘాలోచంలో పడ్డారు. గడువు రానే వచ్చింది. సభ అంతా కూడా పండిత పామరులతో, సామంతరాజులతో, మంత్రులు, వగైరా జనసందోహంతో కిటకిటలాడుతోంది. మహారాజు వున్నతాసనంపై కూర్చోన్నాడు. అంతా నిశ్శబ్ధ వాతావరణం.
మహారాజు ముఖారవిందాన్ని చూసినవాళ్లందరకు యే క్షణంలో యేమి జరుగుతుందోనని ఆతృతగా వుంది. పండిత జనానికి పచ్చి వెలక్కాయ పడివుంది నోట్లో. మహరాజు మరచిపోయేడేమో అనుకునే తరుణంలో గొంతులోంచి కంచుగంట మ్రోగింది. ఏమయింది నా ప్రశ్న? జవాబు దొరికిందా? అంతా నిశ్శబ్ధం. ఎవ్వరూ మాటలాడడానికి సాహసించలేకపోయేరు. ఆసమయంలో ఒక వృద్ధ పండితుడు లేచి నిలబడి మహారాజా నేను బాగా ఆలోచించగా, ఆలోచించగా దొరికిన జవాబు అది యేమిటంటే, అది యేమిటంటే:
“ఏది శాశ్వతం .. గతించేదే .. యిదీ అంతే ”
అని ప్రతి దానికి రాజీ పదడమే అన్నాడు. రాజా దర్బారు అంతా నిశ్చేస్టులై మహారాజువంక చూస్తూ వుండిపోయేరు. మహారాజు కొంతసేపు మౌనం. తరువాత దీర్ఘాలోచన. అప్పుడు మహారాజు ముఖంలో మహదానందం. కరతాళ ధ్వనులు. సభ అంతా కరతాళ ధ్వనులతో కళకళలాడింది. ఆ వృద్ధ పండితుని బహు విధాల సత్కరిస్తూ మహారాజు యిలా అన్నాడు:
“ఈ పండితుని ఆలోచన పటిమ యెంతో ప్రశంసనీయం. చెప్పినది అక్షర సత్యం. నేను రాజుగా వుండే వాణ్ణి. శత్రువులు జయించి నన్ను అడవులకు తరిమేశారు. మళ్ళీ నేను కొన్నాళ్లకు సేనలను కూడగట్టుకొని మీ అందరి ఆదరాభిమానాలతో ఈ సువిశాల సామ్రాజ్యానికి మహారాజునాయ్యెను. ఇది కూడా శాశ్వతం కాదుకదా. అంతా గతించేదే. ఆశాశ్వతమే కదా. తాత ముత్తాతలు రాజులు రౌతులు కాల గర్భములోన కన్నూమరుగయ్యేరు. మనం అందరం కూడా అంటే ప్రతివాడు వున్నన్నాళ్ళు అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను జయించి అంటే వాటికి దాసుడు కాకుండా తమ చెప్పు చేతలలో వుంచుకొని జీవితమంతా సుఖశాంతులతో వుండాలని మహారాజు సభలోనివారందరికి యెంతో సంతోషంతో చెప్పేడు. అందరూ నిండైన ఆనందంతో సభ ముగిసిన తరువాత వారివారి యిళ్లకు వెళ్ళేరు. ఆ వృద్ధ పండితుడు కూడా చాలా సంతోషించేడు.
వివరణ: డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి {సినారె} ఇలాగన్నారు.
అప్పుడప్పుడు దుఃఖమన్నది అ౦టుకోనీ మనసును
ఎప్పుడూ సుఖమైతే మనిషి భరి౦చగలడా బతుకు మ౦చును
ఎప్పుడూ సుఖమైతే మనిషి భరి౦చగలడా బతుకు మ౦చును
స్థిర౦ కాదని తెలిసినా తెగ మరులు కలిగిస్తు౦ది దేహ౦
కాస్త జారితే పగిలిపోయే కడవపై ఎ౦తె౦త మోహ౦
కాస్త జారితే పగిలిపోయే కడవపై ఎ౦తె౦త మోహ౦
అష్టావకృడంటాడు కదా:
“సాకారమనృతం విధ్ధి నిరాకారం తు నిశ్చలం
ఏతత్ తత్వోపదేశేన న పునర్భవ సంభవః” అని
“యదృశ్యం తన్నశ్యం” అని కూడా నానుడి.
కనుపించేది అంతా నశించేదే. ఈ చర్మ చక్షువులకు కనపడనిది జ్ఞాన నేత్రానికి మాత్రమే దర్శనమయ్యే అద్భుతమైన నిధి ఆ పరమాత్మ సన్నిధి. ఆ పరతత్వాన్ని దర్శించి అందరూ జన్మ రాహిత్యమును పొంది మృత్యుంజయులయ్యేదరు గాక. ఆ పరమాత్మ ఒక్కటే సర్వ కాల సర్వ అవస్థల యందు మార్పు లేకుండా శాశ్వతంగా వుండే సత్ చిత్ ఆనందం.